ప్రస్తుతం సినీ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు 2.0. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.500కోట్ల రాబట్టినట్లు యూనిట్ ప్రకటించింది. అయితే 2.0కు సంబంధించి మరో వార్త హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రాన్ని చైనాలోనూ విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోందని... ఆ దేశంలో ఏకంగా 56వేల స్క్రీన్లపై 2.0 ప్రదర్శించేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఈ వార్తను లైకా ప్రొడక్షన్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. హెచ్‌వై మీడియాతో కలిసి చైనాలో 47వేల స్క్రీన్లపై త్రీడీ వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది మేలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. చైనాలో ఒక విదేశీ చిత్రం త్రీడీ ఫార్మాట్‌లో ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం రికార్డని యూనిట్ చెబుతోంది. రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 2.0.. నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. చైనాలో భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయిజాన్, బాహుబలి-2 చిత్రాలు చైనాలో ఘనవిజయం సాధించాయి. అదేబాటలో 2.0 విజయం సాధిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.