రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వం ‘చంద్రన్న కానుక’లను అందిస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా రేషన్ కార్డుదారులకు కానుకలు ఇవ్వనున్నారు. జిల్లాలో 12లక్షల కార్డుదారులకు చంద్రన్న కానుకలను ఉచితంగా పంపిణీ చేస్తారు.
కానుకగా ఆరు వస్తువులు
చంద్రన్న కానుక కింద ఆరు వస్తువులతో కూడిన కిట్‌లను ఇవ్వనున్నారు. కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అరలీటరు పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.400పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. జిల్లాలో పంపిణీకి సంబంధించి ఈసారి 1,200 టన్నుల గోధుమపిండి, 600 టన్నుల శనగపప్పు, 600 టన్నుల బెల్లం, 600 కిలోలీటర్ల పామాయిల్, 150 కిలో లీటర్ల నెయ్యి అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తం సరకుల విలువ దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జిల్లాలో ఉన్న మొత్తం 2,340 రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుకల కిట్‌ను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12లక్షల98వేల 940మంది కార్డుదారులున్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకను అందించనుంది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు క్రిస్టియన్స్ కు చంద్రన్న క్రిస్మస్ కానుకను పంపిణీ చేస్తారు. జనవరి 2 నుంచి 16వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సరకులు జిల్లాకు చేరుకున్నాయి...