YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాదెండ్ల చక్రం తిప్పుతున్నారా... జన సేనలో సీనియర్ల అంతర్మధనం

నాదెండ్ల చక్రం తిప్పుతున్నారా... జన సేనలో  సీనియర్ల అంతర్మధనం
జనసేనలో నాదెండ్ల ఎఫెక్ట్ మొదలయిందా? తమకు తెలియకుండానే నాదెండ్ల అంతా తానే అయి పార్టీని నడుపుతున్నారా? అవును… ఇప్పుడు జనసేనలోని కొందరు నాయకులు మాజీ స్పీకర్ నాదెండ్లపై గుర్రుగా ఉన్నారు. పార్టీని నాదెండ్ల హైజాక్ చేశారని వారు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.  నాదెండ్ల మనోహర్ పార్టీలో అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, రావెల కిశోర్ బాబులను చేర్చుకునే ముందు కూడా తమతో చర్చించలేదని ఈ నేతలు వాపోతున్నారు. కేవలం పవన్ తోనే చర్చించి నాదెండ్ల చేరికలకు శ్రీకారంచుట్టారంటున్నారు. ఇప్పుడు నాదెండ్ల పై అసహనం వ్యక్తం చేసిన నేతల్లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హంకనీసం కీలక నిర్ణయాల్లో కూడా తమను సంప్రదించడం లేదని కస్సు మంటున్నారు. పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న నాదెండ్ల ప్రయారిటీని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై పవన్ తో నేరుగా చర్చించేందుకు సిద్ధమయ్యారు. పవన్ చేస్తున్న పోరాటయాత్రల్లో పాల్గొనకుండా తమ నిరసనను వారు తెలియజేస్తుండటం విశేషం. నాలుగేళ్ల నుంచి పవన్ పార్టీలో ఒక్కరే ఉన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం జనసేన పార్టీని ప్రకటించినా ఆయన తప్ప పార్టీలో ఎవరూ లేరు. తర్వాత మెల్లిగా చేరికలు మొదలయ్యాయి. పవన్ యాక్టివ్ కావడంతో చేరికలు కూడా ఊపందుకున్నాయి. తొలినాళ్లలో పవన్ వెంట మాదాసు గంగాధరం, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, తోట చంద్రశేఖర్ వంటి నేతలు ఉన్నారు. వీరే పవన్ నడిపించేవారు. అయితే వైసీపీలో చేరతారనుకున్న నాదెండ్ల మనోహర్ అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ప్రముఖ రియల్టర్ లింగమనేని సూచనల మేరకే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారన్న టాక్ అప్పట్లోనే బలంగా విన్పించింది. పవన్ ను కంట్రోల్ చేయడానికే నాదెండ్ల మనోహర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు లింగమనేని ద్వారా జనసేనలోకి పంపారన్న ప్రచారమూ లేకపోలేదు. టిక్కెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ వీరిని దూరంగా పెట్టారని నాదెండ్ల వర్గమే సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుందని ఈ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పవన్ తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. వీరిలో ఇప్పటికే కొందరు ఆర్థికంగా జనసేనకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో తమ పరిస్థితి ఏంటని జనసేనానినే అడిగాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇవే పరిస్థితులు కొనసాగితే పార్టీ నుంచి వైదొలుగుతామని కూడా కొందరు హెచ్చరికలు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను జనసేనాని స్వయంగా పరిష్కరించాల్సి ఉంది. నాదెండ్లకు ఎందుకు తాను ప్రాధాన్యత ఇస్తుందీ నేతలకు వివరించి సర్దుబాటు చేస్తే సరిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద నాదెండ్ల పార్టీని హైజాక్ చేశారంటూ కొందరుచేస్తున్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Related Posts