ఎంతో ఉత్కంఠకు తెరలేపిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. మూడు రోజుల్లో ఆ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయం ఊపందుకుంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి గత ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసే పార్టీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉండగా, అధికార పార్టీ మాత్రం తాము చేసిన అభివృద్ధిని నమ్ముకుని ఎన్నికల బరిలో దూకాలని చూస్తోంది. ఇందుకోసం పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. టీడీపీ నేతలకు కూడా ఆ పార్టీ అధినేత టార్గెట్లు ఇచ్చారు. మరోవైపు, ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకునేందుకు కసరత్తు కూడా ప్రారంభించేశారాయన. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో తక్కువ స్థానాలు వచ్చాయి. అందుకే ఈ సారి అక్కడ ఎలాగైనా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది. ఇందులో భాగంగానే రాయలసీమ జిల్లాలో గతంలో లేనంతగా అభివృద్ధి కూడా చేస్తోంది. అందుకుగానూ అక్కడ టీడీపీ పట్ల సానుకూలత బాగా వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే హిందూపురం నుంచి ఆ పార్టీ తరపున 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ ఘనీ.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వద్దకు వెళ్లి, ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో తన సీటును నందమూరి బాలకృష్ణ కోసం త్యాగం చేసిన ఘనీ, అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన ఎప్పుడో పార్టీని వీడుతారని అందరూ భావించినా బాలయ్య బుజ్జగించడంతో ఆగిపోయారు. అయితే, ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించి ఫ్యాను కిందికి చేరిపోయారు. మరి ఆయనకు వైసీపీ టికెట్ ఇస్తుందో లేదో చూడాలి.