YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిసెంబరు 11న పద్మావతి అమ్మవారి రథోత్సవం

డిసెంబరు 11న పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ మేరకు రథోత్సవం  నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు.కాగాతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు త్రివిక్రమ అలంకారంలోని శ్రీ మహావిష్ణువు రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులను సన్మర్గంలో నడిపించేందుకు త్రివిక్రమ అవతారంలో సూర్యప్రభ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు.  బలి చక్రవర్తిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు దశవతారాలలో  వామనవతారం ఒక్కటి. కావున వామనుడినే త్రివిక్రముడంటారని అర్చకులు తెలిపారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.వాహనసేవ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, చంద్రగిరి శాసన సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి
రాత్రి 8.00 గంటల నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.

Related Posts