అమరావతిలో సీఆర్డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్’కు రెండో విడత కూడా అనూహ్య స్పందన లభించింది. రెండో విడతలోనూ నిమిషాల వ్యవధిలోనే వందల ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియలో తొలి అరగంటలోనే 700 ఫ్లాట్లకు పైగా బుకింగ్ పూర్తయింది. ఇందుకోసం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో 60 ఫెసిలేటషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మీసేవా కేంద్రాలు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకు కౌంటర్లలోనూ బుకింగ్ సదుపాయాన్ని కల్పించారు. సీఆర్డీఏ కార్యాలయంలో ఫ్లాట్ బుక్ చేసుకున్న వినియోగదారురాలకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ఫ్లాట్ బుకింగ్ పత్రాన్ని అందించారు. మొత్తం హ్యపీనెస్ట్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. వారంలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే హ్యాపీనెస్ట్ సిరీస్- 2, సిరీస్ -3 ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతాయన్నారు.
ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్డీఏ ఆన్లైన్లో బుకింగ్ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్ నిర్వహించింది. తొలివిడతలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులు పునరావృతం కాకుండా సీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది.