అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో ఈ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కి.మీల లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. 1.5 టన్నుల అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది ఐదోసారి.ఈ విధానంలో క్షిపణి భూ వాతావరణం దాటి వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి వచ్చి శత్రుస్థావరంపై దాడి చేస్తుంది. సాధారణంగా క్షిపణికి అమర్చిన వార్‌హెడ్ తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించగానే తీవ్రమైన ఒత్తిడికి గురై ధ్వంసమైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని దీనికి రక్షణగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. తాజా పరీక్షలో భారత్ ఆర్‌వీ (రీఎంట్రీ వెహికల్) సామర్థాన్ని పరీక్షించినట్లైంది. ఇది విజయవంతం కావడంతో భారత్ ఒకే క్షిపణిలో ఒకటి కంటే ఎక్కువ ఆయుధాలను ప్రయోగించే సాంకేతికత(ఎంఐఆర్‌వీ)కు చాలా దగ్గరైనట్లే. ప్రపంచలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ వద్ద మాత్రమే అధికారికంగా ఈ సాంకేతికత ఉంది. తొలిసారి ఈ క్షిపణి పరీక్షను లాఫ్టెడ్ ట్రజెక్టరీ విధానంలో నిర్వహించినట్లు సమాచారం.