కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ రిజర్వు బ్యాంకులో వివిధ పదవుల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు.