- మూడు స్థానాలు 'కేసిఆర్' ఖాతాలోకే
- ఈ సారి ఆ ఛాన్స్ ఎవరికో..
- నెలాఖరు నాటికి నోటిఫికేషన్
త్వరలో జరుగనున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. మూడు స్థానాలు తెలంగాణాకు దక్కనుండడంతో ఆ స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. పెద్దల సభకు ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చలు గులాబి పార్టీలో మొదలయ్యాయి. ఈ విడత జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణాకు దక్కే మూడు స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయి. విపక్ష పార్టీలన్నీ కలిసినా రాజ్యసభ స్థానం దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మూడు స్థానాలు గులాబి పార్టీ నేతలకే వరించనున్నాయి. ఏప్రిల్లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణాకు దక్కే మూడు స్థానాలను మూడు వర్గాలకు కేటాయించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల లేదా కురమ కులస్తులో ఒకరికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని కేసిఆర్ వెల్లడించారు. దీంతో పార్టీలో ఆ వర్గానికి చెందిన ఐదుగురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్యతో పాటు రాజయ్యయాదవ్ , మురళీ యాదవ్లలో ఒకరికి రాజ్యసభ స్థానం దక్కునుందన్న ప్రచారం జరుగుతోంది. అగ్రవర్ణాలకు చెందిన ఎంతో మంది నేతలు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నా.. ముఖ్యమంత్రి సమీప బంధువు.. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట ఉన్న సంతోష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరో స్థానాన్ని దళితులు లేదా మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి పార్లమెంట్ సభ్యులుగా మైనార్టీలు పార్టీ తరపున ప్రస్తుతం ప్రాతినిథ్యం లేకపోవడంతో మైనార్టీ నేతకు అవకాశం కల్పించే చాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి మూడు రాజ్యసభ స్థానాలకు చాలామంది ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి.. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.