దేశంలోని 22 రాజకీయ పక్షాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించాలని సంకల్పించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమన్వయంతో సోమవారం సాయంత్రం 3.30కు ఇక్కడి పార్లమెంటు అనుబంధ భవనంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల తొలి భేటీకి అనూహ్య మద్దతు లభించింది. తొలుత 14 పార్టీలు భాగస్వాములవుతాయని భావించినా సోమవారానికి ఆ సంఖ్య 22కి చేరింది. దేశంలో ఆర్థిక, సామాజిక, వ్యవస్థాగత అనిశ్చితికి కారణమైన మోదీ ప్రభుత్వం కొనసాగడం దేశానికి ఏ క్షేమం కాదని, అందువల్ల ‘దేశాన్ని కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అనే నినాదంతో 2019 ఎన్నికలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని పార్టీలూ సహకారంతో పని చేయాలని నిర్ణయించారు.