YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాడికి ఆసరా..

పాడికి ఆసరా..

మచిలీపట్నం :

పేద వర్గాల జీవనోపాధికి వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్నవాటిలో పాడిపశువుల పథకం ఎంతో ఉపయుక్తమైనా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు ఇబ్బందికరంగా ఉండటంతో పురోగతి అంతంత మాత్రమే అయింది. పాడి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉండటంతో పాటు రవాణా ఖర్చులు తడిసి మోపుడవటం వంటి కారణాలు లబ్ధిదారులను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పశువులు స్థానిక వాతావరణ పరిస్థితులకు ఇమడవేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. మేలు జాతి పశువుల కొనుగోలు వల్లే లబ్ధిదారులకు మెరుగైన ప్రయోజనం దక్కుంతుందన్న భావనతో ప్రభుత్వం పథక అమలుకు మరికొన్ని వెసులుబాటులు ప్రకటించింది.  గత 15 రోజులుగా పశువుల పంపిణీ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది.
జిల్లాలో వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, తదితర కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే బ్యాంకు అనుసంధాన రుణాల్లో వివిధ యూనిట్లతో పాటు పాడి పశువుల పథకం కూడా ఉంది. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఇటీవల వరకూ నిబంధనల కారణంగా ఆసక్తి ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ముందు వెనుకలు ఆలోచించుకునే పరిస్థితులుండేవి. రమారమి రూ.1.40 లక్షల విలువున్న యూనిట్‌ ద్వారా రెండు పాడి పశువులను ఇవ్వాలన్నది పథక లక్ష్యం. దరఖాస్తుదారునికి ముందుగా ఒక పశువును ఇచ్చాక మరికొన్ని నెలల అనంతరం మరొక పశువును ఇచ్చేవారు. యూనిట్‌ విలువలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 60 శాతం, ఇతరులకు 50 శాతం మేర సబ్సిడీగా ఇచ్చేవారు. పశువులను హర్యానా, ఇతర రాష్ట్రాల్లో ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. తొలిలో అక్కడి నుంచి పశువుల రవాణా ఖర్చులు కూడా లబ్ధిదారుడే భరించాల్సి వచ్చేది. ఈ విషయంలో లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పథకం అమలు విషయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది. ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీ శాతాన్ని పెంచడంతో పాటు రెండు పశువులను ఒకేసారి ఇచ్చేలా ఆదేశాలు జారీ ఆయ్యాయి. రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. తాజా నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చే సబ్సిడీని 60 శాతం నుంచి 75 శాతానికి, ఇతర వర్గాలకు 50 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. సబ్సిడీ పెంపుదలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన పశువులను జిల్లాకు తీసుకువచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. తీసుకువచ్చిన పశువులను స్థానిక వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా చేసిన అనంతరం లబ్ధిదారులకు అప్పచెప్పాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యాన సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను పది రోజుల పాటు సంరక్షించి, తదనంతరం పశు వైద్యాధికారితో ఆరోగ్య పరీక్షలు చేయించాక లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. కెపాసిటీ కేంద్రాల నుంచి పశువులను తమ గ్రామాలకు తీసుకువెళ్లేందుకు రవాణా ఛార్జీల నిమిత్తం ఒక్కో పశువుకు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారు. మూడు నెలలకు సరిపడా దాణాను కూడా ఉచితంగా అందచేయడమే కాకుండా తరచూ పాడిపశువుల ఆరోగ్య పరిస్థితులను పశు వైద్యులు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. పాడి పశువుల కోసం 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా కార్పొరేషన్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,059 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Related Posts