దసరా ఉత్సవాల సమయంలో మెమెంటోల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నలుగురిపై ఈవో కోటేశ్వరమ్మ వేటు వేశారు. దుర్గగుడి వ్యవహారం సిఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఈవో కోటేశ్వరమ్మ ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు సిఎంకు నివేదిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ విషయాన్ని కూడా ఆయనకు తెలిపినట్లు సమాచారం. దీనిపై సిఎం నిర్ణయం తీసుకునే వరకూ తాను మాట్లాడకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య రాజీ కుదిరితే మరి ఈ అవినీతి వ్యవహారాన్ని ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే జరిగితే ఆలయంలో జరిగిన మరిన్ని అవినీతి వ్యవహారాలు మరుగున పడే ప్రమాదం కూడా లేకపోలేదు.అయితే ఇది విచారణలో ఉండగానే ఆలయ ఛైర్మన్ గౌరంగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఈఒ అచ్యుతరామయ్య ఈవోకు క్షమాపణలు చెప్పడం, తాను తిరిగి విధుల్లో చేరి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తానని చెప్పడం తాజాగా చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దుర్గగుడిలో అవినీతిని ప్రక్షాళణ చేస్తూ వస్తున్న ఈవో కోటేశ్వరమ్మ పాలకవర్గ ఒత్తిళ్లకు లొంగుతారా? లేక తన పంథానే కొనసాగిస్తారా? అనేది వేచిచూడాలి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం కాస్త సిఎం చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలిసింది.
ఇటీవల నిర్వహించిన దసరా ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు మెమెంటోలు ప్రదానం చేశారు. అయితే 1200 మెమెంటోలు కొనుగోలు చేయగా, 2 వేలు కొనుగోలు చేసినట్లు చూపారు. ఈ విషయాన్ని గుర్తించిన ఈవో కోటేశ్వరమ్మ ఆలయ ఎఈవో అచ్యుతరామయ్యతో పాటుగా మరో ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మెమెంటోల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఛైర్మన్ గౌరంగబాబు శనివారం కీలకవ్యాఖ్యలు చేశారు. మెమెంటోలు కొనుగోలు వ్యవహారంలో ఈవో తొందరపడ్డారని, అసలు కుంభకోణం ఏదీ జరగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అచ్యుతరామయ్య కూడా ఈవోను కలిసి తాను తొందరపడి నోరు జారానని క్షమాపణలు కోరారు. తిరిగి విధుల్లో చేరుతానని, ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తానని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అంతటా ఉత్కంఠ రేగింది. ఆలయ ఎఈవో అచ్యుతరామయ్యకు, ఈవోకు మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్నారనే వాదనలు బలపడ్డాయి. ఈ వ్యవహారంలో ఎంఎల్‌సి బుద్దా వెంకన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎఈవో అచ్యుతరామయ్య ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో సస్పెండ్‌లో ఉంటే ఆయనకు రావాల్సిన బెనిఫిట్లకు ఇబ్బంది వాటిల్లే అవకాశంతో పాటుగా ఇంతకాలం ఉన్న పేరు ప్రఖ్యాతలు కూడా పోతాయని భావించినట్లు తెలిసింది. అందుకే బుద్దా వెంకన్నతో మధ్యవర్తిత్వం నడిపినట్లు పలువురు చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా రాజీకి ఈఓపై ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే ఈవో కోటేశ్వరమ్మ మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు.
సిఎం వద్దకు పంచాయితీ