తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 10.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. పిల్లల నుండి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి.
శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.
రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12.00 నుండి 1.30 గంటల వరకు రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్ఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోల భాస్కర్, సివిఎస్వో గోపినాధ్జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, విజివో అశోక్కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.