దేశవ్యాప్తంగా చలి ప్రభావం క్రమంగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా పొడి వాతావరణం నెలకొని ఉండటంతో చలి ప్రభావం పెరిగే అవకాశముందని హెచ్చరించింది. తెల్లవారుజామున పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. మంచు, చలి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఒకటి రెండు చోట్ల చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని, అది క్రమంగా బలపడి ఈ నెల 12వ తేదీ తర్వాత వాయుగుండంగా కూడా మారనుందని తెలిపింది. అయితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని స్పష్టం చేసింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ ఎటు వెళ్తుంది అనే విషయంపై స్పష్టత వస్తుందని ప్రకటించింది. ఆ తర్వాత దక్షిణ కోస్తా మీద కొంతవరకు తమిళనాడుపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.