వ్యవసాయ పెట్టుబడులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. అన్నదాతలకు ఆర్ధిక భారమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రకృతి సేద్యాన్ని అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతులకు సూచిస్తోంది. దీని కోసం పెద్ద మొత్తంలోనే నిధులు వెచ్చిస్తోంది. అయితే ప్రభుత్వ కృషి పెద్దగా ఫలితాన్నివ్వడంలేదు. రైతులు ఇప్పటికిప్పుడు ప్రకృతి సేద్యాన్ని అనుసరించేందుకు సుముఖత చూపడంలేదు. వాస్తవానికి రైతుల్లో ఈ విధానంపై అవగాహన కల్పించేందుకే కాక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ ద్వారా ఈ కార్యక్రమాలు సాగిస్తోంది. ఏటా 5 లక్షల మందికి చొప్పున 2022 నాటికి ఏళ్లలో 60 లక్షలమంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించి మొత్తం అందుబాటులో ఉన్న సాగుభూమి రెండు కోట్ల ఎకరాల్లో ఈ విధానం అమలు అయ్యేలా చూడాలనే లక్ష్యం ఉంది. కానీ ఈ టార్గెట్ చేరుకోవడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గత మూడేళ్లుగా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకూ కనీసం వెయ్యి మంది రైతులు వెయ్యి ఎకరాల్లో కూడా ప్రకృతి సేద్యం చేయడంలేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆవు పేడ, మూత్రంతోనే పేడతోనే అన్ని రకాల ఎరువులు తయారు చేసుకుని వినియోగించుకోవాలన్న నిపుణుల సూచనలు అమలుకు నోచుకోవడంలేదు. ప్రస్తుతం పశుపోషణ కూడా రైతులకు భారమైన పరిస్థితి. పశుపోషణ అధిక ఖర్చు, శ్రమతో కూడిన పనిగా మారింది. దీంతో ఎక్కువ మంది రైతులు పశుపోషణపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న విభిన్న పరిస్థితులు ప్రకృతి సేద్యానికి అనుకూలంగా లేవన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో వరితో పాటు వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పొగాకు, పసుపు తదితర పంటలు కూడా విస్తారంగా సాగు చేస్తారు. ఈ పంటలకు సేంద్రీయ ఎరువులు వినియోగించే అవకాశాలు తక్కువే. ఇతర పంటలు పండించే వారు కూడా ఈ తరహా సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా ప్రకృతి సేద్యం పెరిగితే మంచిదే. రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు కొంతమేర తగ్గుతాయి. ఈ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వంతో పాటూ.. రైతులూ చిత్తశుద్ధితో కృషి చేయాలి.