భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సంస్థాగత సామర్థ్యం చాలా బలమైనదని నీతీ ఆయోగ్ పేర్కొంది. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ ఆర్బీఐ సంస్థాగత సామర్థ్యం చాలా బలమైనదని తెలిపారు. మార్కెట్లు ఆర్థిక వ్యవస్థ కోసం చేయవలసినదంతా చేస్తుందన్నారు. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా గత రెండేళ్ళలో విశేష కృషి చేసినప్పటికీ కేంద్ర బ్యాంకు విధి నిర్వహణ ఏదో ఒక వ్యక్తిపై ఆధారపడదని స్పష్టం చేశారు. ఆర్బీఐ వృత్తిగత వ్యవస్థ అని సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యవస్థ అని దాని కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఆర్బీఐ కార్యకలాపాలు యథావిథిగా కొనసాగడానికి చేయవలసినదంతా ప్రభుత్వం చేస్తుందన్నారు.ఉర్జిత్ పటేల్ సోమవారం ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన రాజీనామా సమర్పించారు. ఆయన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.