YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొంచిఉన్న ముప్పు

పొంచిఉన్న ముప్పు
శృంగవరపుకోట పట్టణానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. వర్షాభావ పరిస్థితులతో తాటిపూడి రిజర్వాయరు నీటిమట్టం అట్టడుగుకు చేరడంతో ఆ ప్రభావం ఎస్‌.కోటపైనా పడింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో 319 ఆవాసాలకు నీరందించడానికి రూ.165 కోట్లతో మంచినీటి పథకం తాటిపూడి రిజర్వాయరు వెనుక వైపు నక్కలవలస గ్రామంలో సమీపంలో నిర్మించారు. తాటిపూడి రిజర్వాయరు నుంచి నేరుగా నీటిని తీసుకొని గ్రావిటీ పద్ధతిలో సరఫరా చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం అక్కడ జాక్‌వెల్‌ నిర్మించి భారీ 35హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేశారు. జాక్‌వెల్‌ వెంట్‌ల నుంచి నీరు వెల్‌లోకి చేరితే పంపింగు చేస్తారు. ఈ పథకం మొత్తం నాలుగు దశలు కాగా ఇప్పటి వరకు రూ.75కోట్లు ఖర్చయి రెండు దశల పనులు పూర్తయ్యాయి. మరో రెండు దశల పనులకు నిధులు విడుదల కావాల్సి ఉంది. రెండు దశల పనులతో ఎస్‌.కోట, ఎల్‌.కోట, వేపాడ మండలాల్లో 100 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.
సుమారు 1,15,800 జనాభాకు రోజుకు 55 లీటర్లు చొప్పున 90 లక్షల లీటర్లు నీటిని సరఫరా చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు లేక తాటిపూడి రిజర్వాయరు నీటిమట్టం పడిపోవడంతో గత మే నుంచి నీటికి ఇబ్బంది ఎదురైంది. దీంతో జాక్‌వెల్‌కు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు 10హెచ్‌పీ మోటార్లు పెట్టి నీటిని పైపులు ద్వారా జాక్వెల్‌ వద్దకు పంపేవారు. అయితే నీటి మట్టం క్రమేపీ లోపలికి వెళ్లిపోవడంతో నాలుగు 10హెచ్‌పీ మోటార్లు పెట్టి పైపులు ద్వారా కాలువలోకి పంపి అక్కడి నుంచి జాక్‌వెల్‌కు నీరందించేవారు. అయితే నీటిమట్టం పరిస్థితి రోజురోజుకీ దిగజారడంతో నీరందని పరిస్థితి ఏర్పడింది.
గత 15 రోజులు వరకు మూడు మండలాల్లో 100 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేవారు. మధ్యలో అంతరాయాలు ఏర్పడినా నీటి సరఫరా కొనసాగించారు అయితే నీటిమట్టం జాక్‌వెల్‌కు సుమారు 500 మీటర్లు దూరం వరకు వెళ్లిపోవడంతో నీటి సరఫరా కష్టమైంది. దీంతో ఒక్క ఎస్‌.కోట పట్టణానికే సరఫరా చేసి మిగతా 99 గ్రామాలకు నిలిపివేశారు. గతంలో ఈ 100 గ్రామాలకు 90 లక్షల లీటర్లు నీటిని సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం 6.80 లక్షల లీటర్లు నీటిని మాత్రం సరఫరా చేస్తున్నారు. గతంలో సరఫరా చేసే నీటిలో 10 శాతం కూడా సరఫరా చేయలేకపోతున్నారు. మధ్యలో అడపా దడపా అంతరాలు వస్తూనే ఉన్నాయి. సరఫరా నిలిపివేసిన 99 గ్రామాలకు పాత పథకాలను వినియోగిస్తున్నారు. నీటి పథకాలు లేని గ్రామాల వారు బోర్లును ఆశ్రయిస్తున్నారు. ఈ 99 గ్రామాల్లో కనీసంగా నాలుగో వంతు గ్రామాలకు నీటి పథకాలు లేవు. ఈ గ్రామాల్లో బోర్లు వద్దకు, పొలాల్లో ఉన్న బావుల వద్దకు నీటి కోసం వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. డైరక్టు పంపింగు ఉన్న గ్రామాలు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. రానున్న వేసవిలో ఈ గ్రామాల్లో దాహం కేకలు వినిపించనున్నాయి.
కేవలం పైలట్‌ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్న శృంగవరపుకోట పట్టణానికి నీటి గండం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎస్‌.కోట పట్టణానికి మామిడిపల్లి గ్రామం వద్ద గోస్తనీ ఏటిలో తీసిన ఊటబావులు ద్వారా నీటి సరఫరా జరిగేది. ఎప్పుడో 25 సంవత్సరాల కిందట నిర్మించిన ఈపథకం పట్టణంతో పాటు ధర్మవరం మేజరు పంచాయతీ, మామిడిపల్లి పంచాయతీకి కూడా నీటి సరఫరా చేసేది. ఈ పథకం పైపులైను రోడ్డు కిందన ఉండటం వల్ల ఎస్‌.కోట వయా ధర్మవరం రోడ్డు తరచూ పాడవుతుందని, పైపులైను పూర్తిగా ఆపేస్తే గానీ రోడ్డు బాగుచేయలేమంటూ ఆర్‌.అండ్‌.బి, అధికారులు స్పష్టం చేయడంతో చివరకు పైపులైనును ఆపేశారు. దీంతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డుకు మోక్షం కలిగింది. రోడ్డు వేయడం వల్ల కిందనున్న పైపులైను సుమారు నాలుగు కిలోమీటర్లు మేర దెబ్బతింది.  ట్యాంకుల రోడ్డు మీదుగా కలపడానికి రూ.2.50 కోట్లుతో ప్రతిపాదనలు పైపులైనుకు పంపారు. ఈ పైపులైను కూడా వేసేస్తే ప్రత్యామ్నాయ నీటి సరఫరా అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. అయితే పైలట్‌ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అవుతుండటంతో పట్టణానికి మంచినీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ప్రత్యామ్నాయ పైపులైను గురించి పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. దీంతో ఈ ప్రతిపాదన కూడా ఆగిపోయింది. ఇప్పుడు పైలట్‌ ప్రాజెక్టు పైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోస్తనీ ఏటి పైనుంచి వస్తున్న కొద్దిపాటి ఊటనీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నీటికి అడ్డంగా గట్టు వేసి అక్కడి నుంచి కాలువ తీసి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించి ఈమేరకు పనులు చేస్తున్నారు. జేసీబీతో గట్టు వేసే పనులు చేస్తున్నారు. మోటార్లును తరలించే పనులు చేస్తున్నారు. కనీసంగా రెండు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే వస్తున్న కొద్దిపాటి నీరు ఎన్ని రోజులు సమస్యను పరిష్కరించగలదనేదే ప్రశ్న. ఇది కూడా మరో పదిపదిహేను రోజుల వరకు కాస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఎస్‌.కోట పట్టణానికైనా నీటి సరఫరా చేయాలన్న ఉద్దేశంతో పనులు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లో నీటికి కటకట తప్పదు.

Related Posts