శ్రీహరికోట: షార్ నుంచి మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 19న రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్11 రాకెట్ను రోదసిలోకి పంపనుంది. రాకెట్ అగ్రభాగాన 2.2 టన్నుల జీశాట్-7ఏ ఉపగ్రహ అనుసంధానం పూర్తయ్యింది. ఈ రాకెట్కు వివిధ పరీక్షలు నిర్వహించి ఈ నెల 17వ తేదీన ఎంఆర్ఆర్ ల్యాబ్ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం కౌంట్డౌన్ ప్రారంభించి 19వ తేదీ సాయంత్రం ఈ ప్రయోగాన్ని చేపడతారు. షార్ నుంచి నవంబరు 14న జీశాట్-29, అదే నెల 29న హైసిస్, ఈ నెల 5న ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్-11ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు జీశాట్-7ఏ వంతు వచ్చింది. ఇలా స్వల్ప వ్యవధిలోనే ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తుండటం విశేషం. తాజా ఉపగ్రహం వైమానిక రంగానికి సేవలు అందించనుంది.