కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నిర్వహించిన పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఖజానాలో ఉన్న ఆభరణాల్లో రెండింటిని అమ్మవారికి కానుకగా అందించారు. అందులో 1.74 కేజిల ''బంగారు కాసుల దండ, 776 గ్రాముల బంగారు కుంభ హారతి '' సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
అనంతరం పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. మధ్యాహ్నం 11.42 గంటలకు మకర లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు.