సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు అభిమానులకు ఆరాధ్య దైవమైన రజనీ పుట్టినరోజంటే సందడి మామూలుగా ఉండదు కదా.. అందుకే ఈ వేడుకలు ఘనంగా జరిపేందుకు వారంతా సిద్ధమై పోయారు. అయితే తాను ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటానని, అభిమానులు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రజనీ పిలుపునిచ్చారు. తన నిర్ణయం నిరాశ పరిస్తే మన్నించాలని కోరారు. ఇంతకీ రజనీ పుట్టనరోజు వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారో.. తెలుసా?. ఇటీవల గజ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. తన నిర్ణయం నిరాశపరిచి ఉంటే క్షమించాలని కోరారు. అందులో భాగంగానే వేడుకలకు దూరమైనట్లు తెలిసింది. రజనీకాంత్ మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరి వెళ్లారు. వారం చివరికి ఆయన తిరిగి వస్తారని తెలిసింది. గతేడాది చివరి రోజున రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన రజనీకాంత్ ఆ తర్వాత రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు చేశారు. ఇంతవరకు పార్టీకి సంబంధించిన జెండా, అజెండా, ప్రారంభం తదితర విషయాలను ప్రస్తావించలేదు. మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఈ పుట్టిన రోజైనా రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటన ఏదైనా చేస్తారేమోనని ఎదురు చూసిన రజనీకాంత్ అభిమానులకు నిరాశే ఎదురైంది.