బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియామకం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఉదయం 120 పాయింట్లకుపైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 10,600పైన ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో మెటల్, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్‌తోపాటు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. ప్రభుత్వంతో కొత్త గవర్నర్ సత్సంబంధాలు కొనసాగిస్తారనే అంచనాలతో ఆర్థికరంగ షేర్లు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లకుపైగా లాభంతో 35,779.07 వద్ద.. నిఫ్టీ 188.45 పాయింట్ల లాభంతో 10,737.60 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించి రూ.71.88 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ (+5.27), ఇండియాబుల్స్ హౌసింగ్ (+5.97), హీరో మోటోకార్ప్ (+7.23), అదానీ పోర్ట్స్ (+5.26), యూపీఎల్ (+5.63) సంస్థల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు అధికంగా నష్టపోయిన సంస్థల్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ (-4.78), భారతీ ఇన్‌ఫ్రాటెల్ (-0.97), హెచ్‌పీసీఎల్ (-0.36), టైటన్ కంపెనీ (-0.34) నిలిచాయి.