తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ పడిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావొచ్చని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞాన భేరిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్ ఇస్తానంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చన్నారు. ఎన్టీఆర్ తెదేపాను తెలుగుజాతి కోసం పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామన్నారు.ప్రపంచంలో ఎవరైనా తాజ్‌మహల్ తర్వాత ఏపీ అసెంబ్లీ గురించే మాట్లాడే పరిస్థితి వస్తుందని సీఎం అన్నారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా రాజధాని నిర్మాణం చేపడతామని తెలిపారు.జ్ఞాన భేరి సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను చంద్రబాబు తిలకించారు. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.