అధికార యంత్రాంగం ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా ప్రభుత్వం, ఆలయ భూములను వశం చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిసినా ఇలాంటివారు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. ఇలాంటి కొందరు గుంటూరు జిల్లా అబ్బురాజుపాలెంలోని ఓ ఆలయ భూమిపై కన్నేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ భూమిని ఆక్రమించుకున్న కొందరు పంచాయతీ కార్యదర్శి ద్వారా ధ్రువీకరణ పత్రాలు కూడా పొందారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈభూమిని రోడ్డు విస్తరణలో సిఆర్‌డిఎకు అప్పగించి భూమికి భూమిని మరోచోట పొందేందుకు అధికారుల నుంచి ఒప్పంద పత్రాలను అందుకున్నారని ఆరోపిస్తున్నారు. అబ్బరాజుపాలెంలో 7.12 ఎకరాలను పంచాయతీ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్ట్‌ను బట్టి రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు 23 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆలయ పూజరి, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2017లో ఈ అంశంపై నాటి కలెక్టర్ స్పందించారు. స్థానికుల అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టంచేశారు. అయితే ఈ విషయాన్ని సిఆర్‌డిఎ పట్టించుకోనట్లు సమాచారం. సిఆర్‌డిఎ అధికారులు ఈ భూమిని రాజధాని అభివృద్ధిలో భాగంగా తీసుకుని వారికి పరిహారంగా మళ్లీ అదే స్థాయిలో భూమిని మరోచోట ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలోనే సొమ్ముచేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది బినామి పేర్లతో ప్రభుత్వ భూమిని వ్యక్తిగత సాగు భూమిగా చూపి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారన్న విమర్శలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. భూమి అనుభవ దారులుగా కేవలం పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ సందర్భంగా ఈ శాఖ అధికారులు కూడా అవకతవకలకు పాల్పడినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలు సరిచేయాలని ప్రభుత్వం, ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.