అమరావతి అంతా గ్రాఫిక్స్ బొమ్మలే, భ్రమరావతే మాటలకు చెక్ పడనుంది. దీంతోపక్క రాష్ట్రంలో కొంత మంది కూడా, మన కలల రాజధానిని భ్రమరావతి అంటూ ఎగతాళి చేస్తూ ఉండటం చూసాం. తాజాగా, అమరావతిలో మరో గ్రాఫిక్స్ బొమ్మ, రియాలిటీలోకి వచ్చింది.. అమరావతి రాజధానిలో హైకోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. నేలపాడు రెవెన్యూలో ఈ పనులు పగలు రాత్రి జరుగుతున్నాయి. రోజు 1,600మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. భవనం లోపల 23 కోర్టు హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రౌండు ఫ్లోర్‌లో పోస్టాఫీసు, బ్యాంకు ఉండబోతున్నాయి.హైకోర్టు వెలుపల రాజస్థాన్ రాయితో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. క్లాక్ టవర్ నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయి. 14 కోర్టు హాళ్లు వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి నిర్మాణ సంస్థకు ఆదేశాలు అందినట్టు సమాచారం. డిసెంబరు ఆఖరుకల్లా హైకోర్టు పరిపాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణపనులు జరుగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ కంపెనీ రూ.105 కోట్లతో జీ ప్లస్ 2తో ఈ హైకోర్టు నిర్మాణ పనులు చేస్తోంది. ఉత్తరభాగంలో అతి పెద్ద పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రదేశానంతటినీ చదును చేసి ఉంచారు. న్యాయమూర్తులు రావటానికి ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నారు. సరాసరి కోర్టులోకి న్యామూర్తుల వాహనాలు వెళ్లటానికి పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ రావటానికి మరో దారిని ఏర్పాటు చేస్తున్నారు.ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు ఎదురుగా న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పౌండేషన్ పనులు దాటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డిసెంబరులో హైకోర్టు ప్రారంభిస్తే న్యాయమూర్తులు ఎక్కడ ఉండాలి అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం తాడేపల్లి బైపాస్ రోడ్డులో అపార్ట్‌మెంట్లు పరిశీలించారు. ఫ్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద డి సెంబరు లేదా జనవరి నుంచి రాజధాని అమరావతిలో హైకోర్టు కొలువుదీరనుంది.