మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీదారుగా నిలిచింది. కాంగ్రెస్ కు నిద్రపట్టనివ్వలేదు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారణమని చెప్పకతప్పదు, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలుండగా భారత జాతీయ కాంగ్రెస్ కు 114, భారతీయ జనతా పార్టీకి 109, ఇతరులకు ఏడు స్థానాలు లభించాయి. మూడు ధఫాలుగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోసారి ఒంటిచేత్తో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లాలని గట్టిగా శ్రమించారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న విశ్లేషకుల అంచనాలను సయితం చౌహాన్ మార్చేశారు.అవును… ఒకటి కాదు…రెండు కాదు దాదాపు పదమూడేళ్ల నుంచి ముఖ్యమంత్రి ఆయన. రెండుసార్లు భారతీయ జనతాపార్టీకి మధ్యప్రదేశ్ లో ఒంటిచేత్తో విజయాన్ని అందించారు. నాలుగోసారి కష్టమేనన్న వార్తలు విన్పించాయి. ఇందుకు ప్రధాన కారణం పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ ఉండటంతో సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకత ఆ పార్టీ రెండంకెల స్థానం దాటదని అందరూ ఊహించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని దాదాపుగా చెప్పాయి.కాని ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురయ్యింది. పదిహేనేళ్ల పాలన పై వ్యతిరేకత ఏమాత్రం పనిచేయలేదని ఫలితం ద్వారా స్పష్టమయింది. కేవలం కాంగ్రెస్, బీజేపీలకు తేడా ఐదు సీట్లు మాత్రమే. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా మరికొన్ని చర్యలు తీసుకుంటే విజయం ఖాయమయ్యేదన్న వార్తలు విన్పిస్తున్నాయి. రైతులతో పాటు వివిధ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ అట్రాసిటీ చట్టం పై తీసుకున్న నిర్ణయాలు చౌహాన్ ను వెంటాడుతున్నప్పటికీ ఆయన విజయానికి అతి చేరువగా రావడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నేతలకు కొదవలేదు. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. కమలన్ నాధ్ వ్యూహాలను రచించడంలో దిట్ట. ఇక జ్యోతిరాదిత్య సింధియా జనంలో క్రేజ్ ఉన్న నేత. ఇందరు ఉన్నా అక్కడ కాంగ్రెస్ అరకొర మెజారిటీతోనే అధికారంలోకి రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చౌహాన్ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడంతో పాటు పార్టీ పరువును కాపాడారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం