తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్లు జోష్ ను నింపాయి. చంద్రబాబుకు గాలి అడ్డం తిరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్ కాంగ్రెస్ లో భారీగా చేరికలుంటాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ మీమాంసలో ఉన్న నేతలు సయితం పొరుగు రాష్ట్ర ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు ఇమేజ్, గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని భావించి ఫ్యాన్ పార్టీ వైపునకు మొగ్గు చూపే అవకాశముందన్నది వారి అంచనా. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ సీనియర్ లీడర్లకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ టిక్కెట్లు రాని వారంతా ఇప్పుడు వైసీపీలోకి చేరతారని భావిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత సయితం పక్క రాష్ట్రం రిజల్ట్ చూసి మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సయితం చంద్రబాబుపై ఫైరయ్యారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేనంటూ ఆయన గట్టిగా కోరారు. కాపులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు రోడ్డు మీద నిలబెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనితీరుపై కూడా ముద్రగడ పద్మనాభం అసహనం వ్యక్తం చేయడం విశేషం. పవన్ కు పరిపక్వతలేదని వ్యాఖ్యానించడంతో ముద్రగడ కూడా జగన్ గూటికి చేరవచ్చన్న అంచనాలున్నాయి.తెలంగాణ ఫలితాలతో జనసేనలో చేరాలనుకున్న వారు కూడా కొంత అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. అక్కడి ఫలితాలు ఏకపక్షంగా ఉండటం, అక్కడ మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలకు ఒక్క స్థానం కూడా రాకపోవడంతో జనం తీర్పు ఎలా ఉంటుందో ఇక్కడి నేతలకు తెలిసి వచ్చింది. పవన్ పార్టీపై ఆశలు పెంచుకున్న వారు సయితం పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి కూడా బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆల్టర్నేటివ్ గా జగన్ పార్టీ ఒక్కటే నేతలకు కన్పిస్తోంది. జగన్ గత కొన్నేళ్లుగా ప్రజల్లోనే ఉండటం, ఆయనకు ఒక్కసారి అవకాశమిచ్చి చూస్తే ఏమవుతుందన్న జన నాడిని గుర్తించిన నేతలు వైసీపీ బాట పట్టనున్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చివరి నిమిషంలో టీడీపీలో చేరదామనుకుంటున్న నేతలు సయితం కొంత వెనక్కు తగ్గారని చెబుతున్నారు. ఏపీలోనూ చంద్రబాబు మ్యాజిక్ పనిచేయదన్న ఖచ్చితమైన అభిప్రాయం ఈ నేతల్లో నెలకొంది. అందుకే త్వరలోనే వైసీపీలో భారీగా చేరికలుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.