ప్రజాస్వామ్యం లో గెలుపు పోటములు ప్రజలు నిర్ణయిస్తారని,గెలిచినంత మాత్రాన హీరోలు కాదని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఏపీకి రావొద్దని సీఎం చంద్రబాబు అనలేదని.. ప్రధాని ఇందిర తెలుగు రాష్ట్రాల నుంచి పోటీచేయగా, పీవీ కర్ణాటకలో పోటీ చేశారన్నారు. టీడీపీకి తెలంగాణలో ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పార్టీలు పెట్టి కొంతమంది అక్కడ పోటీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి వారికి తెలియకపోవచ్చని.. కుర్చీలు, ఆఫీసులు లేని స్థితిలో చంద్రబాబును ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్నారు. పార్టీలకు అతీతంగా, చంద్రబాబుపై విశ్వాసంతో ఓట్లు వేశారని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఇంకేమన్నారంటే.. జాతీయ స్థాయిలో పరిణామాలు గమనించండి.. అక్కడి పరిస్థితి వేరు. విభజిస్తే కాంగ్రెస్‌లో ఉండమని చెప్పి టీడీపీలోకి వచ్చాము. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో కుటుంబాలు పార్టీకి దూరమైపోయాయి. కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో పుట్టిన టీడీపీ, బీజేపీతో కలిస్తే మేలు జరుగుతుందనుకున్నాం. జాతీయ రాజకీయాల్లో ఉన్నది రెండు పార్టీలే. ఎవరో ఒకరితో చేతులు కలపాల్సిందే. తెలంగాణ ఎన్నికల్లో ఎవరి వల్ల ఎవరు నష్టపోయారో చెప్పలేం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళతాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారు.