రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాలను ఈ నెల 18 వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఏలూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం జ్ఞానబేరి,వివిధ సంక్షేమశాఖల ప్రగతి తీరు రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలను డిసెంబర్ 18 నుండి 20 వతేదీ వరకు నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నన్నయ్య యూనివర్సిటీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18 వ తేదీ సాయత్రం మూడు గంటలకు ఉత్సవాలు ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతాయన్నారు. మూడురోజుల పాటు ప్రతీ రోజు సాయత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ మూడురోజుల్లోను సర్ సిఆర్ రెడ్డి కళాశాల లో జానపద బృంద నృత్యాలు, సెయింట్ ఆన్స్ కళాశాల ఆడిటోరియంలో శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, వైఎమ్, నిర్వహించబడతాయని అన్నారు. ఈ పోటీల్లో విద్యార్ధినీ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనెలా అన్ని కళాశాలల మాజమాన్యాలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా స్థాయిలో వివిధ సాంస్కృతిక అంశాలలో ప్రధమ విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి విజేతలను ఎంపిక చేస్తారన్నారు.