అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. చంద్రబాబు సర్కార్‌కు ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. హాయ్‌లాండ్ విషయంలో బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. 16 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1100 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.వైఎఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 206 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వంలో కదలిక లేదని మండిపడ్డారు. సీబీసీఐడీ ద్వారా బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎంతమందికి నష్ట పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. హాయ్‌లాండ్ ఆస్తులను దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. బాధితుల జాబితాను బహిర్గతం చేయాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వారితో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బాధితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్గిగా విఫలమైందని మండిపడ్డారు. బాధితుల ఆత్మహత్యలు, ఆర్తనాదాలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు.