వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. జగన్ గత ఏడాది నవంబరు 6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర చేస్తుండటంతో వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలను కొందరు సీనియర్ నేతలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే సీనియర్ నేతలు కూడా కొందరిని గాడిన పెట్టలేకపోతున్నారు. పాదయాత్రను త్వరగా ముగించి పార్టీ పైన దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ఉండటం వల్ల మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు పార్టీ కార్యక్రమాలను సక్రమంగా చేయడం లేదని, లైట్ తీసుకుంటున్నారన్న నివేదిక నేపథ్యంలో పాదయాత్రను త్వరగా ముగించే ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. జనవరి 5వ తేదీన ఎట్టిపరిస్థితుల్లో ఇచ్ఛాపురంలో బహిరంగ సభతో పాదయాత్రకు ముగింపు పలకాలని జగన్ నిర్ణయించారు.ప్రస్తుతం చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో జగన్ పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలో పాదయాత్ర పూర్తి కావడానికి మరో నెల రోజుల పాటు సమయం పడుతుందని పాదయాత్ర సమన్వయకర్తలు తెలిపినా జగన్ మాత్రం జనవరి 5వ తేదీ డెడ్ లైన్ గా పెట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని కూడా వారిని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడం, ఏపీలోనూ రాజకీయాలు హీటెక్కడంతో ఇక పాదయాత్రను త్వరగా ముగించి పార్టీ పటిష్టత పై దృష్టి పెట్టాలని జగన్ నిశ్చయించినట్లు తెలుస్తోంది.ఏడాదికి పైగా పాదయాత్రలో జగన్ ఉండటంతో జిల్లాకు వచ్చినప్పుడు తప్పించి మిగిలిన రోజుల్లో వైసీపీ నేతలు తమ ప్రాంతాల్లో యాక్టివ్ గా లేరన్న నివేదికలు జగన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో పార్టీ బలహీన పడటం పట్ల ఆయన సీనియర్ నేతల ఎదుట ఆందోళన చేసినట్లు కూడా చెబుతున్నారు. పాదయాత్ర విరామసయంలో కొందరినేతలతో చర్చిస్తున్నా రోజంతా నడచి అలసి పోవడంతో ఆయన ఎక్కువసేపు నేతలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే పాదయాత్రకు త్వరగా విరామమిచ్చి విజయవాడలో మకాం వేయాలని జగన్ భావిస్తున్నారు.ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాలను చుట్టేసి వస్తున్నారు. అధికారిక పర్యటనలు అయినా ఆయన పార్టీకి అక్కడ కొంత సమయం కేటాయించి నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. వైసీపీలో కూడా అనేక నియోజకవర్గాల్లో సమస్యలున్నాయి. ముఖ్యంగా ఇన్ ఛార్జులను మార్చడంతో అక్కడ ఒకరంటే మరొకరికి పడటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ సీనియర్ నేతలు సయితం నియోజకవర్గాలుగా సమీక్షలుచేయడం మానేశారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించాలని జగన్ భావించి పాదయాత్రను వీలయినంత త్వరగా ముగించాలని ఆదేశించారని చెబుతున్నారు.