ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలనాధులకు కన్నీళ్లు తెప్పించాయి. తాము అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలూ కోల్పోవడంతో ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు నష్టనివారణ చర్యలకు దిగారు. ఒక్క ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో అనుకున్నదానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించామని పైకి అంటున్నా లోపల మాత్రం లోక్ సభ ఎన్నికల భయం పట్టుకుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అతి పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రాకపోవడంతో కమలనాధులు కొంత డీలా పడ్డారు. కానీ పదిహేనేళ్ల నుంచి అధికారంలో ఉన్న రాష్ట్రం అయినప్పిటికీ ఆ మేర ఫలితాలను సాధించడం పట్ల అమిత్ షా, మోదీలు సంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.ప్రధానంగా రైతు వర్గాన్ని ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా రైతు రుణ మాఫీని ప్రకటిచాలన్న నిర్ణయానికి మోదీ, అమిత్ షాలు వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాల్లో రైతులు రుణ మాఫీ డిమాండ్ ను గట్టిగా చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో అన్నదాతలు ప్రదర్శించిన ర్యాలీ కూడా ఇందుకు అద్దం పడుతుంది. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటించడం వల్ల రైతాంగం లోక్ సభ ఎన్నికల నాటికి తమ పార్టీవైపు మొగ్గు చూపే అవకాశముందన్న అంచనాల్లో వారున్నారు.ప్రధానంగా ఈ మూడు రాష్ట్రాల్లో రైతులు తమకు అండగా నిలవలేదన్నది కమలనాధుల విశ్లేషణ. రైతాంగం భారతీయజనతా పార్టీకి దూరమయిందన్న అంచనాకు వచ్చేశారు. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో రైతులు దూరం కావడం వల్లనే తాము అధికారంలోకి రాలేకపోయామని ఆ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇచ్చిన నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణంగా పెల్లుబికిన వ్యతిరకతతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా కొంత అసంతృప్తి కనపడింది. లోక్ సభ ఎన్నికల నాటికి మైదానాన్ని శుభ్రం చేసే దిశగా మోదీ, అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారు.రైతు రుణమాఫీతో పాటు వివిధ ప్రధాన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడం కూడా ఈ మిషన్ లో భాగంగా ఉందంటున్నారు. మరోవైపు విపక్షాలు కూటమి కడుతుండటం కూడా రైతులను తమవైపునకు తిప్పుకునే ఆలోచన చేసిందంటున్నారు. బహుశా అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీని ప్రకటించి ప్రధాన వర్గాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో? లేదో? చూడాలి మరి.