రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్ కు భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించడం లేదని పేర్కొంది. రాఫెల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ విచారణ కోసం దాఖలైన పిటిషన్, ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్ కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ చేసిన వాదనను అంగీకరిస్తున్నామని, అటువంటి రహస్య ఒప్పందాల్లో భాగంగానే ఈ కేసును విచారించలేమని ధర్మాసనం వెల్లడించింది. విమానాల ధరల విషయం కొనుగోలు కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీలేవని జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదని పిటిషనర్ కోర్టు ప్రశ్నించింది. రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందం వెనుక కుంభకోణం ఉందని, వాటి నిజాలు తేలాలంటే, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేసారు. దాంతొపాటు రాఫెల్ వ్యవహారం పై సీబీఐ విచారణ కోరుతూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరుస్తూ రాఫెల్ ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని సీజేఐ పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో మోడీ సర్కార్ కు భారీ ఊరట లభించింది.