YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడుగంటిన జలం

అడుగంటిన జలం

గుంటూరు :

జిల్లాలో ఎన్నడూలేని విధంగా మూడు నెలలుగా సాధారణ వర్షాలు కూడా లేకపోవడంతో భూగర్భ జలాలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. సాగర్‌, డెల్టా కాలువల పరిధిలో నీటి విడుదల కొనసాగుతున్నా బోరు బావుల వాడకం కొనసాగుతూనే ఉంది. సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు నీరందక ఒకవైపు,. కుడికాలువకు ఎగువన కాలువలు లేక పూర్తిగా బోర్లపైనే మరోవైపు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పట్టణాలపై వలసల ఒత్తిడి పెరగడంతో పురపాలక సంస్థలు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో పట్టణవాసులు రోజువారీ అవసరాలకు విచ్చలవిడిగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.
జిల్లాలో రాజధాని నిర్మాణం నేపథ్యంలో మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. వీటివల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది నివాసం ఉంటుండడంతో అవసరాలు పెరిగి పరిమిత ప్రాంతంలో జలాలు తోడేస్తున్నారు. కృష్ణానదిలో అడ్డూఅదుపూ లేకుండా ఇసుక తవ్వకాలు చేయడం, నదిలో ప్రవాహం లేకపోవడంతో ఒడ్డున ఉన్న గ్రామాల్లోనూ కటకటలాడే పరిస్థితి నెలకొంది. డిసెంబరు ప్రారంభంలోనే ఆందోళనకర పరిస్థితులు ఉన్నందున జనవరి నుంచి కాలువలకు నీటి విడుదల ఆగిపోతే భూగర్భ జలం మరింత పడిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయంలో సమర్థ నీటి వినియోగంతోపాటు ప్రతి వ్యక్తీ నీటి పొదుపుపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఆగస్టు నుంచి ఒక్క మంచి వర్షం కూడా పడలేదు. ఏటా నవంబరులో తుపానులు వచ్చి కొంత వర్షపాతం నమోదయ్యేది. ఈసారి వాటి ప్రభావం కూడా లేక ప్రతి నెలా లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆగస్టు మినహా ఖరీఫ్‌, రబీ సీజన్లలో లోటు వర్షపాతం నమోదైంది. కృష్ణానది ఎగువ ప్రాంతంలో పడిన వర్షాలతో డెల్టాలో వరి, సాగర్‌ కాలువల కింద ఆరుతడి పంటలకు నీరందించారు. అయితే వర్షాభావ పరిస్థితులు కొనసాగడంతో వాతావరణంలో మార్పులు వచ్చి మిరపకు బొబ్బర, పత్తి కాయలకు పుచ్చు రావడంతో రైతులు క్రిమిసంహారక మందులు విపరీతంగా వినియోగించినా అదుపులోకి రావడం లేదు. వాతావరణ ప్రతికూలత చీడపీడలకు అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related Posts