ప్రజా భవిష్యనిధి (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) చట్టానికి కేంద్రం పలు సవరణలు చేసింది. ఇకపై, పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కాకముందే ఆ ఖాతాను మూసేసే వీలును కల్పించింది. అయితే, ఉన్నత విద్య అవసరాలు, వైద్యానికి అత్యవసర పరిస్థితుల వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పీపీఎఫ్‌ను నిర్ణీత గడువు కన్నా ముందే డ్రా చేసుకునే వీలును కల్పించింది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ద్వారా ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. కాగా, మైనర్లు కూడా గార్డియన్ల సహకారంతో పీపీఎఫ్ ఖాతా తెరవడానికి చట్టంలో కొత్త నిబంధనలు చేరుస్తున్నారు.
ఇక, పీపీఎఫ్ ఖాతాదారు చనిపోతే తలెత్తే వివాదాల పరిష్కారానికి గానూ కొత్త నిబంధనలను చట్టంలో జోడిస్తున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సరళంగా, సునాయసంగా జరిగేందుకే చట్టంలో ఈ మార్పులు తీసుకురాబోతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇక, వడ్డీరేట్లు, పన్ను విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయట్లేదని తెలిపింది.