కల్లూరు ప్రాంతంలో తెల్లవారుజామున పెద్దఎత్తున పొగమంచు కమ్ముకుంటుండడంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వాగు లు, వంకలు, కుంటలు, ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు హంద్రీ నది, చెరువుల్లో కూడా నీరు అధికంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం 7 గంటలైనా ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. హంద్రీనీవా కాలువ నీరు మండల పరిధిలోని వామసముద్రం, తడకనపల్లి, చిన్నటేకూరు, కొంగనపాడు, ఉలిందకొండ, చెట్లమల్లాపురం, బస్తిపాడు, నాయకల్లు, తదితర గ్రామాల మీదుగా ప్రవహి స్తుండడంతో భూగర్భజలాలు బారిగా పెరిగాయి. హంద్రీనీవా నీటిని కూడా గాలి పైపుల ద్వారా హంద్రీనదికి వదలడంతో హంద్రీనదిలో నీరు బాగా ప్రవహిస్తుంది. ఈ నీటితో రైతులు వేసిన పంటలు పచ్చగా ఉన్నాయి. గత ఏడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది చల్లి తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో రోడ్లపై వెళ్లే వాహనాదారులు ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇక చలి తీవ్రతకు కూడా ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు పంపడం లేదు.