YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భగవంతుడు సత్యము, నిత్యము కదా ? మరి మనుష్యులలో నాస్తికులు ఎందుకు వుంటున్నారు ?

భగవంతుడు సత్యము, నిత్యము కదా ? మరి మనుష్యులలో నాస్తికులు ఎందుకు వుంటున్నారు ?

మనము చేసే మంచి పనులే మనకు రక్షణగా వుంటాయి. కొంతమంది అజ్ఞానముతో, అహంకారముతో ఆయా జన్మములయందు లభించే తాత్కాలిక సంపదలను చూసుకొని తప్పులు చేస్తూ వుంటారు. తప్పు చేసాము అని ప్రాయశ్చిత్త భావన పొందిన వాళ్ళు, ఆయా తప్పులకి ఆ జన్మలోనే ఫలితాన్ని అనుభవించి మళ్లీ లభించే జన్మ మంచిదిగా వుండాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ వుంటారు. కాని, కొంతమంది వాళ్ళు చేసే తప్పులు తెలుసుకొని కూడా మార్పు రాకపోగా, మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే వుంటారు.

ప్రస్తుత సమాజంలో చాలామంది "నేను అందరికీ యజమానిని, అందరూ నా సేవకులుగా వుండాలి" అనే భావనతో వుంటున్నారు. ఇటువంటివారు దేవుని పైన భక్తిని, సమాజముపట్ల సేవని నటిస్తూ, ఇతరులని బాధపెడుతూ తాత్కాలిక ఆనందాన్ని, భోగాన్ని పొందుతుంటారు. ఇటువంటివారు ఎంత భక్తి నటించినా, ఆయా దోషముల ఫలితాలని ఆ జన్మలో అనుభవించటమే కాకుండా మళ్లీ జన్మకి కూడా మోసుకొని వెళుతూ వుంటారు. చేసే దోషముల యొక్క ప్రభావాన్ని బట్టి మరు జన్మము నందు వాళ్ళు దేవునికీ, భక్తులకీ, మంచివాళ్ళకీ దూరముగా ఉంచ బడతారు. వారే నాస్తికులు.
వాళ్ళు చేసిన దోషముల ప్రక్షాళన అయ్యాక తిరిగి భక్తులుగా, మంచి వాళ్ళుగా మారతారు. మంచి వారితో స్నేహాన్ని పంచుకుంటారు.

ఉదాహరణకి విష్ణు మూర్తుల వారి ద్వారపాలకులు అయినటువంటి జయ విజయుల గురించి మనకందరికీ తెలుసు. వారు నిత్యమూ దేవుణ్ణి పూజిస్తూనే వున్నా, నిస్వార్థంగా లోక శ్రేయస్స్సు కోసము జీవితాన్ని గడిపే ఋషుల పట్ల దోషము చేయటము వలన మూడు జన్మముల పాటు దేవునికి శత్రువులుగా పుట్టటం జరిగింది.

అందుకని, పూర్వ జన్మలో చేసుకున్న కొంత పుణ్యము వలన మనకు అత్యంత పవిత్రమైన ఈ మానవ జన్మ లభించింది. ఈ జన్మలో మంచి బుద్ధితో వ్యహరిస్తూ, చెడు ఆలోచనలకీ, చెడు మార్గాలకి, చెడు స్నేహాలకి దూరంగా వుంటే, బతికినంత కాలము ఆయురారోగ్యాలతో బ్రతకటమే కాకుండా వచ్చే జన్మలో కూడా మంచి మనిషిగా జన్మించటం జరుగుతుంది. 

భగవంతుని అనుగ్రహము వలన మంచి మార్గంలో ప్రయాణం చేసే వారికందరికీ శుభము చేకూరు గాక !
సద్గురువుల అనుగ్రహము వలన అందరికీ మంచి బుద్ది, మంచి ఆలోచన, మంచి వ్యక్తులతో స్నేహము అనే మూడు సద్గుణములు చేకూరు గాక !

Related Posts