హౌసింగ్ విభాగంలో కొత్తగా వచ్చిన నిబంధన అలా ఇల్లు గడిచే అవకాశాలు కూడా పనితీరుకు లంకె వేస్తోంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై సీరియస్‌గా వుందని తేల్చి చెప్పేందుకు హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థకు జీతానికి, పనితీరుకు లంకె పెట్టింది. ఇల్లు కడితేనే మీ ఇల్లు గడుస్తుందంటూ స్పష్టంచేస్తూ సరికొత్తగా మార్గదర్శకాలను విడుదలచేసింది. దీని ప్రకారం ఇంతకాలం హౌసింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఇక నుంచి గృహమిత్రలుగా గుర్తిస్తారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగం అందుబాటులోకి రాక ప్రైవేటుగా ఉద్యోగావకాశాలు దారుణంగా సన్నగిల్లిపోయిన పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ఆపై చదువులు చదివిన వారు కూడా చివరకు హౌసింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా స్థిరపడిపోవడం తెలిసిందే. అవకాశాలు లేని ఎంతోమంది యువత ఈ విధంగా పొట్ట పోషించుకునేందుకు అందుబాటులోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా కూడా విధుల్లో చేరిపోయారు. ఆ విధంగా వారు ఇల్లు గడుపుకుంటూ కొనసాగుతున్నారు. తాజాగా ఇళ్ల నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన ప్రభుత్వం వర్క్ ఇన్‌స్పెక్టర్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీరిని పూర్తిగా అదుపులో ఉంచుకుంటే తప్ప అనుకున్న రీతిలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగదన్న ‘ఉన్నత స్థాయి’ ఆలోచనతో సరికొత్త మార్గదర్శకాలను తెరపైకి తీసుకువచ్చింది. ఇక నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను గృహమిత్రలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ నెల నుంచి వారందరికీ పనితీరు ఆధారంగానే జీతాలు చెల్లింపు జరుగుతుంది. ఒక్కో గృహమిత్రకు ఈ విధానంలో 250 గృహాలను కేటాయిస్తారు. ఇప్పటికే దాదాపుగా గృహ మిత్ర ఒక్కొక్కరికి 250 గృహాలు చొప్పున డిఇఇ స్థాయి అధికారులు కేటాయింపు పూర్తిచేశారు. మూడు నుంచి నాలుగు గ్రామాల్లో వివిధ పథకాల్లో మంజూరైన 250 గృహాలకు గృహమిత్రలు ఇన్‌ఛార్జులుగా నియమితులవుతారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వారి డివిజన్‌లో వున్న డిఇఇలు గృహమిత్రలకు కేటాయించిన ఇళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం ఖరారుచేయాల్సి వుంటుంది. గృహమిత్రలు ఎఇలకు తగిన సహకారం అందిస్తూ జియోటాగింగ్, డాక్యుమెంటేషన్, ఫారం-30 రిజిస్టర్లు పూర్తిచేయడం, లబ్ధిదారులు సకాలంలో ఇళ్లు కట్టుకునేలా వారిని చైతన్యపర్చడం వంటి పనులను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వారికి కేటాయించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో గృహ మిత్రలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. డిఇఇలు ఎప్పుడైనా పని తిరిగి విభజించాల్సిన అవసరం వున్న పక్షంలో ప్రతీ నెలా మొదటి వారంలో మాత్రమే ఈ పనులు చేయాల్సివుంటుంది. గృహమిత్రల పనితీరు అనుసరించి ఇంటి నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రతీ ఒక్క ఇంటికీ అయిదు స్థాయిల్లో రూ.750, రూ.1000 చొప్పున జీతం చెలిస్తారు. ఇఇలు, డిఇఇలు ప్రతీ నెలా కట్టిన ఇళ్లు, ఇవ్వాల్సిన జీతం సరిచూసి మంజూరు చేయాల్సి వుంటుంది. ఆన్‌లైన్‌లో నమోదైన పురోగతిని అనుసరించి గృహమిత్రల జీతభత్యాల చెల్లింపు జరుగుతుంది. ప్రతీ ఒక్క గృహమిత్ర నెలకు కనీసం 20 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి వుంటుంది. నెలకు 20 ఇళ్లకు పైన పూర్తి చేసిన వారికి మైదాన ప్రాంతంలో ఇంటికి 300 చొప్పున, ఏజెన్సీ ప్రాంతంలో ఇంటికి 400 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. ప్రతీ నెలా 25వ తేదీ నాటికి పూర్తిచేసిన ఇళ్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఇక నుంచి గృహ నిర్మాణాన్ని పరుగులు తీయించాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఏ విధంగా చూసినా ఇక నుంచి ఇల్లు కట్టి చూపితేనే గృహమిత్రల ఇళ్లు గడిచేది అన్న అంశాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పష్టం చేసిందనే చెప్పాలి. దీనిపై వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇప్పటికే ఆందోళన బాట పట్టడం తెలిసిందే. నిర్మాణానికి, జీతాలకు లంకె పెట్టడంతో ఎంత మంది విద్యావంతులు ఇప్పుడు మరోసారి నిరుద్యోగులుగా మిగిలిపోతారో వేచి చూడాలి.