తుపాన్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధం అయింది. శనివరాం ఉదయం పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. జిల్లాల్లో తుపాన్ ముందస్తు సన్నద్ధతలపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా కుడా అధికార యంత్రాంగంతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం ఉదయానికి శ్రీహరికోటకు 790 కిలో మీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నది . శనివారం మద్యాహ్నం తరువాత తుపాన్గా రూపాంతరం చెంది రాత్రి తీరం దాటోచ్చని అంచనా వేస్తున్నారు. తుపాన్ తూర్పుగోదావరి- విశాఖపట్నంల మధ్య తీరం దాటే అవకాశాలు వున్నాయి. ఐవీఆర్ ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రమాద హెచ్చరికల జారీ ఫలితంగా మత్స్యకారుల పడవలు తీరంలోనే నిలిచిపోయాయి.