లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈనెల 24న కమలదళాధిపతి అమిత్ షా, జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రం పర్యటనకు రానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో తీవ్ర నిరుత్సాహానికి గురైన కార్యకర్తల్లో జాతీయ నాయకత్వం ద్వారా నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలని తలపెట్టింది.
రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా 118 స్థానాల్లో పోటీ చేసిన భాజపా ఏకంగా 105 స్థానాల్లో ధరావత్ కోల్పోయింది. కేవలం 13 చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కాయి. 2019లో కేంద్రంలో తిరిగి భాజపా అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన రాష్ట్రాల్లోనూ పార్టీని పటిష్ఠం చేసేందుకు అగ్రనాయకత్వం ప్రణాళికలు రచించింది. తెలంగాణలో జరిగిన ఎన్నికలతో దక్షిణాదిన పాగా వేయాలని భావించినప్పటికీ తీవ్ర నిరాశే ఎదురైంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాతో పాటు 15 మంది కేంద్రమంత్రులు, పలువురు భాజపా పాలిత ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఐదు సిట్టింగ్ స్థానాలతోపాటు మరో 10 సీట్లు గెలిచి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించినప్పటికీ కారు ధాటికి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు పరాజయం చెందారు. కేవలం ఒక్క గోషామహల్ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. భారీ అంచనాలు పెట్టుకున్న కమలనాథులకు ఎన్నికల ఫలితాలు కంగుతినిపించాయి. తెలంగాణ, మిజోరంలో అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యం నెరవేరకపోగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని కోల్పోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ అధ్యక్షులు, పదాధికారులతో సమావేశమై పరాజయానికి గల కారణాలను విశ్లేషించారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల ఫలితాల నుంచి తేరుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 24న రాష్ట్రంలో పర్యటించి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపనున్నారు. జనవరి మొదటివారంలో ప్రధాని నరేంద్రమోదీపాటు పలువురు కేంద్రమంత్రులు రానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి కారు స్పీడుకు బ్రేకులు వేయాలని యోచిస్తోంది. దాంతో ఏప్రిల్‌లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం రెండు, మూడు సీట్లు దక్కించుకుని గులాబీ తోటలో కమలాన్ని వికసింపచేయాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు.