బీజేపీయేతర ఫ్రంట్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫ్రంట్ ఏర్పాటు ఆదిలోనే హంసపాదులా మారుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మూడు రాష్ట్రాల్లో సాధించిన విజయం చూసి బీజేపీని వ్యతిరేకించే వారంతా సంతోషించారు. కానీ మమతా బెజర్జీ మాత్రం మౌనంగా ఉండి పోయారు. బీజేపీయేతర ఫ్రంట్ ప్రయత్నాలకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసినా కనీసం రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు కూడా ఆమె చెప్పలేదు. గతంలో సోనియాగాంధీతో పలుమార్లు భేటీ అయిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ ఆ పార్టీ బలపడుతుందనే సంకేతాలు రావడంతో దూరంగా జరుగుతున్నారు. ఆమె తీరును జాతీయ రాజకీయాలు పరిశీలిస్తున్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాకపోయినా మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఓడించగలదనే అభిప్రాయం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ కు ఎందుకు దూరమవుతున్నారో అర్థం కావడం లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.. అయితే ఆమె లక్ష్యం ప్రధాన మంత్రి పదవి కావడంతో కాంగ్రెస్ బలపడి 150 లోక్ సభ సీట్లు తెచ్చుకుంటే రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని.. తనకు అవకాశం రాదని ఆమె భావిస్తున్నట్టు బెంగాల్ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ తో కాకుండా విడిగా ఉంటే కర్ణాటకలో కుమారస్వామికి సీఎం పదవీ దక్కినట్టు తనకు అవకాశం వస్తుందనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనకకు అన్న చందంలా మారుతున్నాయి.