టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందనీ విమర్శించారు. అలాంటి వారిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని మండిపడ్డారు. కోర్టు తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని తెలిపారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్ ను కోర్టు స్పష్టంగా చెప్పినా.. సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్కి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేర చరిత్ర కలిగిన ఈరన్నను కాపాడాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే, ఆయన శుక్రవారం రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటంగా సురేష్ అభివర్ణించారు.