YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి దిల్లీ మీదుగా లఖ్‌నవూ వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని నిలిపివేశారు. విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఇండిగో విమానం శనివారం ఉదయం 6.05గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి లఖ్‌నవూ బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అవడానికి ముందు ఈ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. గో ఎయిర్‌ విమానంలో దిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ మహిళ విమానాశ్రయం టర్మినల్‌ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి.. ఇండిగో 6ఈ 3612(ముంబయి-లఖ్‌నవూ మార్గం) విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.బాంబు బెదిరింపుల అసెస్‌మెంట్‌ కమిటీ కూడా ప్రమాదం జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని భద్రతాసిబ్బంది స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఇంతవరకూ స్పందించలేదు. ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది కూడా స్పష్టత రాలేదు.

Related Posts