- మరియా ఇవానోవ్నా వస్సిలేవా
మేరీ వాస్సియఫ్‌గా రష్యన్ చిత్రకళాసామ్రాజ్యంలో విశిష్ట పేరు ప్రఖ్యాతులు సంసాదించుకున్న కళాకారిణి ఆమే. ఆమె చేతిలో రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుతమైన కళాఖండాలు అనేక మ్యూజియమ్స్‌లో ప్రదర్శనకు ఉంచారు. ప్యారిస్‌లోని కళాకారుల్లో ఒకరిగా కీర్తిగాంచారు.
రష్యాలోని స్మోలేనస్క్‌లో సంపన్నుల కుటుంబంలో మేరీ జన్మించారు. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్‌గా చూడాలన్న ఆకాంక్షతో వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేయమని ప్రోత్సహించారు. అయితే, చిత్రకళపై చిన్నతనం నుంచి సహజంగా ఏర్పడిన ఆసక్తి వైద్యవిద్యవైపు కాకుండా చిత్రకళవైపు ఆమెను నడిపించింది. 1903లో సెయింట్ పీటర్స్‌బర్గ్ అకాడమీలో చేరారు. అక్కడ కోర్సు పూర్తి చేసిన తర్వాత 1905లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు వెళ్లారు. ప్రపంచం కళాత్మక నగరంగా పేరుగాంచిన పారిస్‌లోనే ఆమె ఉండిపోయారు. అనేక రష్యన్ వార్తాపత్రికలకు కరస్పాండెంట్‌గా ఉద్యోగం చేస్తూ.. 1908లో అకాడెమీ రస్సే (రష్యన్ అకాడమీ)ను స్థాపించారు. ఆ తర్వాతి ఏడాది నుంచి ఈ అకాడమీ వాసిలెఫ్‌గా మార్చబడింది. 1913 నాటికి ఆమె ఆర్ట్ స్టూడియో విశేషాదరణ పొందింది. కళాత్మక రంగంలోనే కాదు సేవారంగంలోనూ మేరీ ఎంతో కృషి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో ఆమె ఫ్రెంచ్ రెడ్ క్రాస్‌లో నర్సుగా స్వచ్ఛందంగా పనిచేశారు. ప్యారిస్‌ని అనేక మంది కళాకారుల కోసం 1915లో క్యాంటీన్ తెరిచారు. అర్ధాకలితో అలమటించే కళాకారులకు తక్కువ ధరకు భోజనం ఇక్కడ లభించేది. విదేశాల్లో తన కళాఖండాలతో అనేక ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత ఆమె ఇటలీలో 1929లో వాసిలెఫ్ మ్యూజియాన్ని ప్రారంభించారు.