ప్రముఖ నవ నారసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధిచెందిన శ్రీ వైష్ణవ క్షేత్రం, స్వయంభూ ఆలయం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల కబ్జా యధేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి మెట్లకు సమీపంలో స్థలాన్ని దర్జాగా కబ్జాజేసి, అక్కడ ఒక విగ్రహం ఏర్పాటుచేసి, షెడ్డు కూడావేసి, ఆ విగ్రహానికి పూజారి కాని పూజారి పూజలు చేస్తున్నా పురావస్తు శాఖ, దత్తత దేవాలయమైన అన్నవరం దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారు. సుప్రసిద్ధ క్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గత నెల 13న శ్రీకృష్ణ చైతన్య సంఘం పేరుతో ఒక ప్రైవేటు వ్యక్తి పురావస్తు, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ప్రతిష్ఠ జరపకుండా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. స్వామి వారి పాదాలు నుండి కొండపైకి వెళ్లే ప్రారంభ ప్రదేశంలో కొంత స్థలాన్ని ఆక్రమించి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. అనంతరం ఆ విగ్రహానికి పైన సిమెంటు రేకులతో షెడ్డు ఏర్పాటు చేశాడు. అక్కడ అర్చక స్వాముల అనుమతి లేకుండా ఉదయం, సాయంత్రం పూజలు, హుండీ వసూలు ప్రారంభించడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ గత కొన్నాళ్లుగా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకు అన్నసమారాధన చేసే కమిటీతో సదరు పూజారి కాని పూజారి మీరు ఇక్కడ అన్నసమారాధన ఎవరి అనుమతితో చేస్తున్నారంటూ వివాదం పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో గ్రామస్థులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని ప్రతిష్ఠ లేకుండా ఎవరి అనుమతితో శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశావని ప్రశ్నించారు. దీంతో అతడు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రంగరాజభట్టార్‌కు చెప్పి చేశానని సమాధానమిచ్చాడు. కృష్ణుడి విగ్రహం పెట్టడం వరకేనని, ఆ విగ్రహంతో నీకు పనిలేదని, ప్రతిష్ఠ జరగని శిలావిగ్రహాన్ని దివ్య క్షేత్రంలో ఏర్పాటు చేయకూడదని సదరు వ్యక్తికి కరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా అతడిని బయటకు పంపివేశారు. దీంతో సదరు వ్యక్తి లక్ష సంతకాలు సేకరిస్తానని, తనను ఎవ్వరూ అడ్డుకోలేరంటూ బీరాలు పలికాడు. కాగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న అన్నవరం దేవస్థానం దత్తత ఆలయంగా ఉన్న స్వయంభు దివ్యక్షేత్ర ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తి ప్రతిష్ఠ లేకుండా శిలావిగ్రహాన్ని ఏర్పాటుచేసే వరకూ ఇక్కడ ఉన్న ఆలయ అధికారులు ఏమిచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అతడు ఏర్పాటు చేసిన శిలావిగ్రహానికి శిలాఫలకాన్ని అతికించాడు. ఆ శిలాపలకంపై సదరు వ్యక్తి యొక్క తల్లి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా పేర్లు చెక్కించుకున్నాడు. సుమారు వెయ్యి ఏళ్లుగా ఈ ఆలయానికి రాజులు, మహారాజులు, భూస్వాములు, జమిందారులులు ఎనే్నన్నో దానాలు చేసినా అంత పెద్ద పేర్లు శిలాఫలకంపై చెక్కించుకోలేదు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కోరుకొండ నరసన్న ఆలయం ప్రాంగణంలో ఏ విధమైన అనుమతులు లేకుండా శిలావిగ్రహం, శిలాఫలకం ఏర్పాటుజేసిన సంఘటన ఇదే కావడం విశేషం. ఈ సంఘటన చూసిన కొందరు భక్తులు తాము కూడా శిలాఫలకం, విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వస్తున్నారు. కాగా స్వామివారి దివ్యక్షేత్రంలో ఏ విగ్రహాన్నైనా ఏర్పాటు చేయాలంటే స్థపతి సూచన మేరకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యజ్ఞంచేసి శిలావిగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. అనంతరం నిత్యం త్రికాలాల్లో వైఖానస అర్చకులు మాత్రమే అర్చన చేయాలి. లేదంటే గ్రామానికి అరిష్టమని పలువురు పండితులు తెలుపుతున్నారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో కొత్తవి ఏర్పాటు చేయలన్నా, పాతవి తొలగించాలన్నా రాష్ట్ర పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఏవీ పాటించకుండా ఒక ప్రైవేటు వ్యక్తి శిలావిగ్రహాన్ని ఏర్పాటుజేసి, ఆ స్థలాన్ని కబ్జాచేసినప్పటికి స్థానికంగా ఉండే దేవాదాయ శాఖ సిబ్బంది, ఆలయ అర్చకులు, వంశపారంపర్య ధర్మకర్త స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సదరు సంఘటనపై అన్నవరం దేవస్థానం ఈఓ స్పందించి పూర్తి విచారణ జరపాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఁ