తెలంగాణ ఎన్నికలు జగన్ కు కొంత కలసి వచ్చాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణ ఎన్నికలు రావడం తమకు కొంత మేలు చేశాయని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని శక్తులు ఏపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా తెలంగాణ ఎన్నికలు తమకు ఉపకరించాయని భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలు భయపడుతున్నది అదే. ఎన్నికలకు ముందు లగడపాటి రాజగోపాల్ వంటి నేతలు సర్వేల పేరుతో ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తారని వైసీపీ నేతలు ముందుగానే ఊహించింది. తెలంగాణలో మహాకూటమి గెలిచి ఉంటే లగడపాటి రాజగోపాల్ సర్వేకు విశ్వసనీయత ఉండేది. మహాకూటమి గెలిచి ఉంటే లగడపాటి ఏపీ ఎన్నికల పోలింగ్ కు ముందు కూడా రెండు మూడు సర్వేలు వదిలేవారని వైసీపీ నేతలు భయపడిపోయారు.అయితే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి చతికలపడటం, లగడపాటి సర్వేకు పూర్తిగా విరుద్ధంగా రావడంతో వైసీపీ నాయకత్వం ఊపిరిపీల్చుకుంది. చంద్రబాబు నాయుడు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేస్తారని వైసీపీ నేతలు ముందునుంచే అనుమానిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే చంద్రబాబునాయుడిని రెండు, మూడుసార్లు కలిసి చర్చలు జరపడం కూడా వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు తెలంగాణలో లగడపాటి సీన్ రివర్స్ కావడం తమకు మంచిదైందని అంటున్నారు. అలాగే ప్రధాన మీడియా కూడా తెలంగాణలో మహాకూటమికి అనుకూలంగా చేసిన ప్రచారం, పోలింగ్ ముందు రోజుకూడా వండి వార్చిన వార్తలు దానికి విజయాన్నిఅందించలేకపోయాయి. ఏపీ ఎన్నికల్లో కూడా కొన్ని మీడియా సంస్థలు వైసీపీపై ఒంటికాలితో లేచే ప్రమాదం ఉందన్నది తమకు తెలియంది కాదని, అయితే తెలంగాణ ఎన్నికలతో ప్రధాన మీడియా వార్తలను కూడా ప్రజలు విశ్వసించే అవకాశం లేదని, ఇదితమకు అనుకూల పరిణామమని వైసీపీ నేతలు ఫుల్లు జోష్ లో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా ఆరునెలలు కూడా లేవు. జగన్ పాదయాత్ర ముగించి మరోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎటూ చీలదన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. జనసేన పవన్ కల్యాణ్ ను ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్న అంచనాల్లో ఉన్నారు. ఏపీలో కూడా వన్ సైడ్ పోలింగ్ తో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ధీమా వారిలో వ్యక్తమవుతుంది. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్నది
పక్కనపెడితే లగడపాటి సర్వేల తికమక ఇక ఏపీలో ఉండదన్నది మాత్రం నిజం. అందుకే ఫ్యాన్ పార్టీ ఊపిరిపీల్చుకుంది. థ్యాంక్స్ టు కేసీఆర్ అంటోంది.