YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తీరాన్ని తాకిన పెథాయ్‌ తుపాను ఏడు జిల్లాలలో భారీ వర్షాలు

తీరాన్ని తాకిన పెథాయ్‌ తుపాను            ఏడు జిల్లాలలో భారీ వర్షాలు
కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు సెలవు ప్రకటించారు.కాగాపెథాయ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీగా పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన రాజప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీని తీవ్రత తూర్పు గోదావరి జిల్లాపైనే అధికంగా ఉంటుందని తెలిపారు. ‘‘ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్ధాల కొరత లేకుండా చూస్తున్నాం. తుపాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుంది.’’ అని మంత్రి చిన రాజప్ప తెలిపారు.
కాకినాడ : పెథాయ్‌ తుపాను ప్రభావం తూర్పు గోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 32 మి.మి అత్యధిక వర్షపాతం ఆత్రేయపురం మండలంలో నమోదు కాగా అత్యల్పంగా అంబాజీపేట మండలంలో 16.4 శాతం నమోదైంది. అలాగే రావులపాలెంలో 22, కొత్తపేటలో 25.4 మి.మి, ముమ్మిడివరంలో 25 మి.మి, అయినవిల్లిలో 25.4 మి.మి, పి గన్నవరంలో 22.4 మి.మి, ఐ పోలవరం మండలంలో 18.4 మి.మి, మామిడికుదురులో 23.2, రాజోలులో 34.8, మలికిపురంలో 30.4, సఖినేటిపల్లిలో 27 మి.మి, అల్లవరంలో 21.08 మి.మి, ఉప్పలగుప్తంలో 20.2 మి.మి, కాట్రేనికోనలో 20.08 మి.మి వర్షపాతం నమోదైంది.
పెథాయ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. తుపాను తాళ్లరేవు, యానాం మధ్యలో తీరం దాటనుందని తెలిపారు. 14 మండలాల్లో 5500 మందిని సహాయక కేంద్రాలకు తరలించామని.. 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐ.పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు చెప్పారు.పెథాయ్‌ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలు  చిగురుటాకులా వణుకుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచీ ఈదురుగాలులు వీస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లోని 30 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో 50 వరకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మిగతా గ్రామాల్లోని పరిస్థితిని సునిశితంగా గమనిస్తోంది. అయిదు మండలాల పరిధిలో దాదాపు 6 లక్షల మంది జనాభా ఉన్నప్పటికీ తీర ప్రాంతంలో దాదాపు లక్ష మందిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన జనరేటర్లు, నీటి ట్యాంకర్లు తరలిస్తున్నారు. వంట గదులను సిద్ధం చేస్తున్నారు. విశాఖ సంయుక్త కలెక్టర్‌ సృజన గ్రామాల్లో పర్యటించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన ఆరు బృందాలు సామగ్రితో రంగంలోకి దిగాయి. నౌకాదళం, కోస్టుగార్డు విభాగాలనుఅప్రమత్తం చేశారు. అయిదు మండలాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌ కేంద్రాలు, జీవీఎంసీ, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కార్యాలయాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని యంత్రాంగం గమనిస్తోంది. చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోట్లన్నీ సురక్షితంగా తీరానికి చేరుకున్నాయి.

Related Posts