ఓవర్‌నైట్ స్కోరు 132/4తో నాలుగో రోజు, సోమవారం ఆస్ట్రేలియా ఆట ఆరంభించి కోహ్లీసేనకు 287 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే తొలి ఓవర్‌లోనే ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0) డకౌట్ అయ్యాడు. స్టార్క్ వేసిన బంతిని వదిలేయాలా వద్దా ఆలోచించేలోపు బంతి వికెట్లను పడగొట్టింది. 13 పరుగుల వద్ద నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (4; 11 బంతుల్లో 1×4)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (17; 40 బంతుల్లో 2×4), మురళీ విజయ్ (20; 67 బంతుల్లో 3×4) కాసేపు నిలిచారు. ఆచితూచి ఆడారు. తేనీటి విరామం తర్వాత స్పిన్నర్ లైయన్ వీరి పనిపట్టాడు. పిచ్‌పై లభిస్తున్న బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఫ్లయిటెడ్ డెలివరీలతో ఉక్కిరి బిక్కరి చేశాడు. జట్టు స్కోరు 48 వద్ద కోహ్లీ, 55 వద్ద విజయ్ వెనుదిరిగారు. హనుమ విహారి (24; 58 బంతుల్లో 4×4) అండగా అజింక్య రహానె (30; 47 బంతుల్లో 2×4, 1×6) నిలిచాడు. ఆసీస్ బౌలర్లను అడ్డుకున్నాడు. అర్ధశతకం దిశగా సాగాడు. అయితే హేజిల్‌వుడ్ వేసిన బంతిని ఆడబోయి హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ విజయంపై ఆశలు సన్నగిల్లాయి. రిషభ్ (9; 19 బంతుల్లో) ఆచితూచి ఆడాడు. ప్రస్తుతం ఆశలన్నీ విహారి, పంత్‌పైనే. ఆట ముగిసే సరికి భారత్ 112/5తో ఉంది. విజయానికి ఇంకా 175 పరుగులు అవసరం.