నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో, అమరావతిలో మరో ఆరు ఐటీ స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఎపీఎన్‌ఆర్‌టీ) ఆధ్వర్యంలో ఐదు సంస్థలను అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుల సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ) ఆధ్వర్యంలో మరో సంస్థను అందుబాటులోకి తెస్తున్నారు.ఈ నెల 19న ఐటీ మంత్రి నారా లోకేశ్ వీటిని ప్రారంభించనున్నారు. వీటిలో నాలుగు సంస్థలను విజయవాడలో, మరో రెండింటిని మంగళగిరిలోని ఎన్‌ఆర్టీ టెక్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థలు మొత్తం 530 ఉద్యోగాలు కల్పించనుండగా ప్రారంభం నాటికి 150 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీల వివరాలు.... జీటీ కనెక్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, 100 ఉద్యోగాలు; పరికారమ్ ఇటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, 100 ఉద్యోగాలు; టెక్ స్పేస్, 100 ఉద్యోగాలు; ట్రెండ్ సాఫ్ట్ టెక్నాలజీస్, 100 ఉద్యోగాలు; డయాగ్నో, స్మార్ట్ సోలుషన్స్, 30 ఉద్యోగాలు; ఏపి ఆన్లైన్ , 100 ఉద్యోగాలు... మొత్తం 530 ఉద్యోగాలు...కృష్ణా, గుంటూరుల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు గత ఏడాది కాలంలో 35 వరకూ ప్రారంభమయ్యాయి. వీటిలో 2300కు పైగా కొలువులు స్థానిక యువతకు లభించాయి. మరో ఆరు నెలల్లో గన్నవరంలోని ఐటీ పార్కులో రెండో టవర్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీనిలో మరో 25 కంపెనీల వరకూ రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మేధాటవర్స్‌లో 12 కంపెనీలు ఉండగా.. మరికొన్ని కంపెనీలకు త్వరలో స్థలం కేటాయించనున్నారు. గుంటూరు పరిధిలోని మంగళగిరిలోనూ ప్రస్తుతం ఓ ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. దీనిలో 50వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి వచ్చింది. మూడు అంతస్థుల్లో పైకేర్ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసింది. మరో అంతస్తులో ఇతర కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ ఐటీ టవర్‌లో మొత్తం 400మంది వరకూ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడే మరికొన్ని కూడా ఏర్పాటు కానున్నాయి.. మంగళగిరి పరిధిలోనూ మరో 30 ఐటీ కంపెనీల వరకూ ఏర్పాటు చేసేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మంగళగిరిలో హెల్త్‌క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, బీమా కంపెనీల ప్రొసీజర్స్ వంటి కంపెనీలు దీనిలో రానున్నాయి. గన్నవరం ఐటీపార్క్‌లో మేధాటవర్స్‌కు వెనుకవైపు రెండో ఐటీ టవర్ నిర్మాణం ప్రారంభమైంది