ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు కొంత వెసులు బాటు లభించింది. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కుమారస్వామి సర్కార్ ఊపిరి పీల్చుకుంది. సొంత పార్టీలో అసమ్మతుల బెడద ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం మరొకవైపు సంకీర్ణ ప్రభుత్వానికి చుక్కలు కన్పిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న టెన్షన్ వారిని నిద్రలేకుండా చేస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కమలం పార్టీ ఓటమి పాలు కావడంతో కొంత వెసులు బాటు చిక్కిందంటున్నారు.కుమారస్వామి సర్కార్ కు మరో ఆరు నెలల పాటు ఢోకా లేదన్న వాదన విన్పిస్తోంది. ప్రస్తుతం అసమ్మతి నేతలు కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొంత మెత్తబడ్డారంటున్నారు. కాంగ్రెస్ వైపు గాలి వీస్తుందన్న నమ్మకంతో కొందరు తమ ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం మంత్రి వర్గ విస్తరణ వరకూ వేచి చూద్దామని భావిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత తిరిగి అసమ్మతి కాంగ్రెస్ పార్టీలో చెలరేగే అవకాశముంది.మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ వస్తున్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పదవుల పందేరం ఇప్పట్లో ముగిసి పోదని సిద్ధరామయ్య గట్టిగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో శ్రమపడ్డవారికి, విజయానికి దోహదపడ్డ వారికి అధిష్టానమే పెద్దపీట వేస్తుందని సిద్ధరామయ్య చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా అసమ్మతిగా ముద్రపడిన నేతలతో ఆయన సమావేశమై చర్చలు జరుపుతున్నారు.కుమారస్వామి కూడా ఇక పాలనపై దృష్టి పెట్టనున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ మ్యానిఫేస్టోలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రధానంగా అసంతృప్తిలో ఉన్న రైతాంగం సమస్యలను అధిగమించేందుకు ఆయన ఆల్మట్టి, మెకేదాటు వంటి నీటి పారుదల అంశాలను ఎత్తుకున్నారని చెబుతున్నారు. యడ్యూరప్ప కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొంత మెత్తబడినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద కుమారస్వామి, సిద్ధరామయ్యలు ప్రస్తుతం ఊపిరిపీల్చుకున్నారు.