రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వినూత్నమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంటే ఈ నెల 11 తర్వాత ఏపీలో అధికార టీడీపీ నాయకులు ఆసక్తిగా చర్చించుకుంటు న్నారు. తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతేకాదు. 2014 ఎన్నికల్లో కన్నా దూసుకుపోయిం ది. 23 స్థానాలను పెంచుకుంది. మరి ఇక్కడ టీడీపీ కూడా విజయం సాధించడం ఖాయమే..అనే భావన ఇక్కడ తెలుగు దేశం పార్టీ తమ్ముళ్లలో కనిపిస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు తెలంగాణా ప్రజలు బ్రహ్మరథం పట్టారు కాబట్టి.. ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు.నిజమే! తెలంగాణాలో ప్రభుత్వం చేపట్టిన పథకాలకు భారీ ఎత్తున అక్కడి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చాయి. అయితే, ఈ ఒక్కటే అక్కడ పనిచేసి ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ, బలమైన నాయకత్వం.. బలమైన నాయకుడు కూడా తెలంగాణాలో ఉండబట్టే.. ఫలితంగా ఈ రేంజ్‌లో ఉందనేది విశ్లేషకుల భావన. కట్ చేస్తే.. ఏపీలో పరిస్థితికి, ఏపీలో రాజకీయాలకు తెలంగాణా రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఏపీలో మాదిరిగా తెలంగాణాలో ప్రత్యేక హోదా వంటి కీలక విషయం లేదు. అదే సమయంలో అగ్రి గోల్డ్ వంటి కీలకమైన ఎగవేత దారు కేసు కూడా తెలంగాణాలో ప్రభుత్వంపై సంకటస్థితిని సృష్టించలేదు. అదే విధంగా ఏపీలో ఇటీవల జరిగిన విపక్ష నాయకుడిపై కత్తి దాడి ఘటన తెలంగాణాలో జరగలేదు.అన్నింటికన్నా కీలకమైన మరో విషయం ఏంటంటే.. జగన్ వంటి బలమైన నాయకుడు కూడా ప్రత్యామ్నాయంగా తెలంగాణాలో మనకు కనిపించలేదు. ఇక, ఉన్న ఏకైక విపక్షంలోనే సీఎం సీటు నాదంటే నాదని నాయకులు రోడ్డెక్కే పరిస్థితి తెలంగాణాలో కనిపించింది. మరి ఈ పరిస్థితి ఏపీలో లేదు. ఇక, ఎమ్మెల్యేలపై భూకబ్జా ఆరోపణలు, కాల్ మనీ ఆరోపణలు వంటివి కూడా మనకు ఏపీలోనే కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం విషయం పెద్ద చర్చకు దారితీసింది. కేంద్రంతో భారీ ఎత్తున పెరిగిన విభేదాలు ఇక్కడే మనకు వినిపిస్తున్నాయి. నిజానికి నాలుగున్నరేళ్లు బీజేపీతో కలి సి ఉండి కూడా ఏపీకి ఏమీ చేయించుకునే పరిస్థితి లేక పోవడం కూడా ఇక్కడి అధికార పార్టీకి మైనస్ గా మారిపోయింది. పరిణామాల నేపథ్యంలో తెలంగాణాలో అధికార పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి.. ఇక్కడ ఏపీలోనూ మనం జెండా ఎగరేద్దాం.. అనే పరిస్థితి టీడపీకి ఉండేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. పవన్, జగన్ వంటి బలమైన నాయకులు ఇక్కడ చంద్రబాబు కంట్లో నిద్రపోతున్నారు. అదే సమయంలో తమ్ముళ్ల అవినీతి, పదవీ వ్యామోహం, అసంతృప్తి.. వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని అంత తేలికగా ఒప్పుకొనే పరిస్థితి అయితే లేదు!